వేధింపులు భరించలేక రాజకీయాలకు గుడ్ బై!

ఏపీ టిడిపి సీనియర్ నేత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి ఆదివారం రాజీనామా చేశారు. తన నియోజకవర్గంలో వైసీపీ నేతల, కొందరు ప్రభుత్వాధికారుల వేధింపులు భరించలేకనే రాజకీయాల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. తనను టార్గెట్ చేసుకొన్న వైసీపీ నేతలు తన అనుచరులను, పార్టీ కార్యకర్తలను కూడా వేధిస్తున్నారని, తన వలన వారు సమస్యలు ఎదుర్కొంటుండటం తనకు చాలా బాధ కలిగిస్తోందని అందుకే ఈ కటిన నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించారు. 

వైసీపీ నుంచి నానాటికీ ఒత్తిడి పెరిగిపోతుండటంతో ఆయన మొదట వైసీపీలో చేరేందుకు కూడా సిద్దపడ్డారు కానీ స్థానిక వైసీపీ నేతలు ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకించడంతో పార్టీలో చేరలేకపోయారు. దాంతో ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. 

ఆయన నిర్ణయంపై స్పందించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు “ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎదురు తిరిగి పోరాడాలి తప్ప భయపడి పారిపోకూడదు. వల్లభనేని వంశీకి వ్యక్తిగతంగా, పార్టీ పరంగాకూడా అండగా నిలబడేందుకు నేను సిద్దంగా ఉన్నాను. కనుక ఆయన తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరుతున్నాను,” అని అన్నారు. కానీ వంశీ తన నిర్ణయానికే కట్టుబడి ఉండాలనుకొన్నారు.