
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై పార్టీలో సీనియర్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలపై ఆయన పార్టీ పెద్దలను సంప్రదించకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని పార్టీలో సీనియర్లు తప్పు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగిలిన కాంగ్రెస్ పెద్దలెవరికీ ఈ విషయం తెలియదట! రేవంత్ రెడ్డి ఎవరినీ సంప్రదించకుండా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
కానీ కాంగ్రెస్ పార్టీయే ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చినట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడంతో, ఇక ఆ సమయంలో వెనకడుగువేస్తే కాంగ్రెస్ ప్రతిష్టకు భంగం కలుగుతుందనే ఉద్దేశ్యంతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు కూడా ముట్టడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. దాంతో అది కాంగ్రెస్ కార్యక్రమమేనని ప్రజలు కూడా భావించారు. కానీ పార్టీలో సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి తీరును తప్పుపడుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది.
ఈ అంశంపై భట్టి విక్రమార్క అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో సమావేశం జరిగింది. పిసిసి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. రేవంత్ రెడ్డిని మందలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.