
దసరా శలవుల అనంతరం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు తెరుచుకొన్నాయి. కానీ ఆర్టీసీ సమ్మె కారణంగా తగినన్ని బస్సులు లేకపోవడంతో తల్లితండ్రులు తమ పిల్లలను కార్లు, బైకులపై దింపేందుకు బయలుదేరారు. దాంతో హైదరాబాద్ రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.
కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునీయడంతో రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ తరలివస్తున్నారు. వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా అనేకవేలమంది హైదరాబాద్ చేరుకొంటూనే ఉన్నారు. పోలీసులు వారిని కూడా అడ్డుకొనేందుకు ప్రగతి భవన్వైపు వెళ్ళే అన్ని మార్గాలలో వాహనాలను ఆపి తనికీలు చేస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది.
ఒకవైపు బస్సులు లేకపోవడం, పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోవడం, కాంగ్రెస్ నేతల ప్రగతి భవన్ ముట్టడి కారణంగా పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలతో ఉదయం 10.30 నుంచే సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ నుంచి పంజగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో జంటనగరాలలో ప్రజలు మెట్రోలో ప్రయాణించేందుకు తరలివస్తుండటంతో మెట్రో రైళ్ళు కూడా ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి. అటు రోడ్లపై ప్రయాణించలేక, ఇటు మెట్రోలో ఖాళీలేకపోవడంతో జంటనగరాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మె ముగిస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం అయ్యేలా లేవు. కానీ ఆర్టీసీ సమ్మెపట్ల ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. కనుక ఈ సమస్యలు ఇంకా ఎంతకాలం భరించాలో తెలియని పరిస్థితి నెలకొంది.