రేవంత్‌, కోమటిరెడ్డి అదృశ్యం!

కాంగ్రెస్‌ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి ఆదివారం రాత్రి నుంచి కనబడటం లేదు. ఈరోజు ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునీయడంతో పోలీసులు తమను అరెస్ట్ చేయవచ్చని ఊహించిన వారిరువురూ నిన్న రాత్రి తమ ఇళ్లకు రాలేదు. కనుక పోలీసులు వారి అనుచరుల ఇళ్ళలో, ప్రగతి భవన్‌ పరిసర ప్రాంతాలలో ఉన్న హోటల్స్‌లో వారి కోసం గాలిస్తున్నారు. కానీ ఉదయం 11 గంటల వరకు వారిరువురూ ఆచూకీ లభించలేదు. బహుశః మరికొద్ది సేపటిలోనే ప్రగతి భవన్‌ సమీపంలో ప్రత్యక్షమవుతారని పోలీసులు భావిస్తుండటంతో ఆ మార్గాన్న వెళుతున్న ప్రతీ ఒక్కరినీ నిశితంగా పరిశీలించినా తరువాతే అనుమతిస్తున్నారు. 

గాంధీభవన్‌ నుంచి బయలుదేరిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వివిద జిల్లాల నుంచి ప్రగతి భవన్‌ ముట్టడికి బయలుదేరుతున్న కాంగ్రెస్‌ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. వి.హనుమంతరావుతో సహా పలువురు నేతలను గృహనిర్బందంలో ఉంచారు.

సీనియర్ కాంగ్రెస్‌ నేత షబ్బీర్ ఆలీ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఉద్యమాలతో సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో ఈవిధంగా నిరవధిక సమ్మెలు, అరెస్టులు, గృహ నిర్బందాలు చూస్తామని అనుకోలేదు. సిఎం కేసీఆర్‌ పోలీసుల సాయంతో ప్రభుత్వం నడిపించాలనుకుంటున్నారు. ఇది కేసీఆర్‌ నిరంకుశత్వానికి అద్దం పడుతోంది. అయితే అరెస్టులు, గృహ నిర్బంధలతో సమ్మెను, ప్రజా ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదని సిఎం కేసీఆర్‌కు కూడా తెలుసు. కనుక ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు మొదలుపెట్టి తక్షణం సమ్మెను ముగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.