హుజూర్‌నగర్‌లో పోలింగ్ షురూ

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలకు పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయ్యింది. హుజూర్‌నగర్‌లో తెరాస అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్‌-పద్మావతి రెడ్డి, బిజెపి-కోటా రామారావు, టిడిపి-చావా కిరణ్మయి పోటీ చేస్తున్నారు. వీరుకాక మరో 15 మంది స్వతంత్ర అభ్యర్ధులు కూడా పోటీ చేస్తున్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో మొత్తం 2.36 లక్షల మంది ఓటర్లున్నారు. పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. 

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం వలన ఖాళీ అయిన ఈ స్థానాన్ని మళ్ళీ దక్కించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంటే, లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా ఎదురుదెబ్బ తిన్న తెరాస ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించుకొనేందుకు ఈ స్థానాన్ని దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని తహతహలాడుతున బిజెపి కూడా ఈ ఉపఎన్నికలలో తన సత్తా చాటుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. రాజకీయ కారణాలతో టిడిపి కూడా బరిలో దిగింది. 

హుజూర్‌నగర్‌లో రాజకీయాపార్టీల మద్య తీవ్రపోటీ నెలకొని ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నివారించేందుకు నియోజకవర్గంలో ఏకంగా 3,000కు పైగా పోలీసులను మోహరించారు. ప్రతీ మండలానికి ఒక డిఎస్పీని, ప్రతీ గ్రామానికి 10 నుంచి 15మంది పోలీసులను నియమించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఉపఎన్నికల ఫలితాలు ఈనెల 24న వెలువడతాయి.