రేపటి నుంచి క్యాబ్‌లు కూడా బంద్‌

ఆర్టీసీ సమ్మెతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రేపటి నుంచి ఆ కష్టాలు మరికొంత పెరుగనున్నాయి. రాష్ట్రంలో ఊబర్, ఓలా క్యాబ్ ఒనర్లు, డ్రైవర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం శనివారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించనున్నారు. 

క్యాబ్ ఒనర్లు, డ్రైవర్ల జేఏసీ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ, “మా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్ట్ 30వ తేదీన మేము రవాణాశాఖకు వినతిపత్రం అందజేశాము. కానీ దానిని పట్టించుకోలేదు. ఓలా, ఊబర్ యాజమాన్యాలు కూడా మా డిమాండ్లపై చర్చకు అంగీకరించడం లేదు. కనుక మా సమస్యల పరిష్కారం అయ్యేవరకు శనివారం నుంచి నిరవధిక సమ్మె చేయబోతున్నాము. ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నాము. అలాగే వారు కూడా మాకు మద్దతు తెలిపారు. రేపు జరుగబోయే తెలంగాణ బంద్‌కు మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము,” అని అన్నారు. 

ఆర్టీసీ సమ్మె జరుగుతున్న కారణంగానే హైదరాబాద్‌ మెట్రోకు ప్రయాణికులు సంఖ్య గణనీయంగా పెరిగారు. వారి వలన మెట్రో ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అలాగే సమ్మె కారణంగానే రాష్ట్రంలో ఆటోలు, ప్రైవేట్ బస్సులు, క్యాబ్‌లు కూడా మంచి ఆదాయం సంపాదించుకొంటున్నాయి. ఇటువంటి సమయంలో క్యాబ్‌ డ్రైవర్లు, యజమానులు నిరవధిక సమ్మె చేస్తే వారు...వారితోపాటు ఓలా, ఊబర్ కంపెనీలే ఈ అదనపు ఆదాయాన్ని కోల్పోయి నష్టపోతారు. వాటిపై ఎక్కువగా ఆధారపడుతుండే హైదరాబాద్‌ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు. క్యాబ్‌ల సమ్మె వలన ఆర్టీసీ సమ్మెకు మరింత బలం చేకూరవచ్చు కానీ సమ్మె చేస్తే క్యాబ్‌ నిర్వాహకులు, యజమానులు, డ్రైవర్లే ఎక్కువగా నష్టపోతారని గ్రహిస్తే మంచిది.