
టీఎస్‌ఆర్టీసీలో ఖమ్మం డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆర్టీసీ సమ్మె పట్ల సిఎం కేసీఆర్ కటినవైఖరితో వ్యవహరిస్తుండటంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఖమ్మం పట్టణంలో జరిగిన ధర్నాలో పాల్గొని ఇంటికి తిరిగివచ్చిన తరువాత ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయనను మొదట ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కాంచన్ బాగ్ వద్ద గల అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో వైద్యులు ఆయనను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ 80-90 శాతంపైగా గాయలవడంతో ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు.
విషయం తెలుసుకొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, టిజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఇంకా పలువురు ప్రతిపక్ష నేతలు ఆసుపత్రివద్దకు చేరుకొంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి మృతి చెందినట్లు తెలియగానే ఆర్టీసీ కార్మికులు ఆసుపత్రి వద్ద బైటాయించి ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని అరెస్ట్ చేస్తుండటంతో ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొని ఉంది. మరికొద్ది సేపటిలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కూడా అక్కడకు చేరుకొనున్నారని సమాచారం.