టీఎస్‌ ఆర్టీసీ సమ్మె ఉదృతం

నేటితో టీఎస్‌ఆర్టీసీ సమ్మె 9వ రోజుకు చేరింది. నిన్న ఖమ్మం డిపోకూ చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతో నేడు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చాయి. దానికి కాంగ్రెస్‌, వామపక్షాలు, న్యూ డెమోక్రసీ పార్టీలు, విద్యార్ధి, కార్మిక సంఘాలు మద్దతు ఇస్తుండటంతో బంద్‌ సంపూర్ణంగా జరుగుతోంది. ఈరోజు తెల్లవారుజామునుంచే ఆర్టీసీ కార్మికులు, వారికి మద్దతు ఇస్తున్న పార్టీల నేతలు జిల్లాలోని డిపోలవద్దకు చేరుకొని బైటాయించి ధర్నాలు చేస్తుండటంతో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు బస్సులు నడిపేందుకు రాలేదు. దాంతో నేటి ఉదయం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటకు వెళ్ళలేదు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నంతో ఆర్టీసీ కార్మికులను తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. డిపోలవద్ద బస్సులు అడ్డుకునేవారితో కటినంగా వ్యవహరించాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రస్తుతం డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.