ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఎలాగూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె 8వ రోజుకు చేరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకోబోము... జీతాలు చెల్లించమని సిఎం కేసీఆర్‌ చెపుతుండటంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైన ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం రాపర్తినగర్‌లోని తన నివాసంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. అతనిని రక్షించే ప్రయత్నంలో అతని కుమారుడికి కూడా గాయాలయ్యాయి.

శ్రీనివాస్ రెడ్డిని అతని కుటుంభ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో శ్రీనివాస్ రెడ్డికి 80 శాతంపైగా గాయాలయ్యాయి. మెరుగైన వైద్యచికిత్స కోసం హైదరాబాద్‌ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ విషయం తెలుసుకొన్న ఆర్టీసీ కార్మికులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆసుపత్రి వద్ద బైటాయించి సిఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు.

అదే సమయంలో మరో కార్మికుడు కూడా ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకోబోయాడు కానీ పక్కనే ఉన్న కార్మికులు అడ్డుకొని కాపాడారు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఉద్వేగంతో ఉన్నారు. రేపు ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చారు.