
నేటితో ఆర్టీసీ సమ్మె 8వ రోజుకు చేరుకొంది. ఈరోజు ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద బైటాయించి ధర్నాలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు బిజెపి మద్దతు పలుకడమే కాకుండా ఈరోజు వారితో కలిసి బిజెపి నేతలు ధర్నాలలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని బస్‌భవన్ వద్దకు భారీ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు చేరుకొని ధర్నా చేపట్టారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్, స్థానిక బిజెపి నేతలు కూడా వచ్చి బస్‌భవన్ ముందు బైటాయించి ధర్నాలో పాల్గొన్నారు. పోలీసులు వారిని అదుపులో తీసుకొని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై సిఎం కేసీఆర్ కక్షగట్టినట్లు వ్యవహరిస్తుండటాన్ని కె.లక్ష్మణ్ తప్పు పట్టారు. పండుగ సమయంలో ఆర్టీసీ కార్మికులను వారి కుటుంభాలను ఈవిధంగా క్షోభపెట్టడం సరికాదని అన్నారు. ఇకనైనా సిఎం కేసీఆర్ తన మొండిపట్టుదల మానుకొని తక్షణమే ఆర్టీసీ కార్మిక సంఘాలతో మళ్ళీ చర్చలు మొదలుపెట్టాలని కోరారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి భవిష్య కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఆర్టీసీని కాపాడుకోవడం కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్దమని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి అన్నారు.