1.jpg)
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎప్పుడూ ఏదో సంచలనం సృష్టిస్తూనే ఉంటారు. జిల్లాలోని కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ చౌరస్తా వద్ద గల ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నియోజకవర్గం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను నిత్యం ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం చూసి నాకు డబ్బు ఎక్కువైపోయి చేస్తున్నానని అందరూ అనుకొంటున్నారని తెలుసు. కానీ మీకెవరికీ తెలియని విషయం ఏమిటంటే నాకు సుమారు రూ.100 కోట్లు వరకు అప్పులు ఉన్నాయి. అప్పులున్నాయని సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం మానుకోలేదు. అవసరమైనప్పుడు నా అభిమానుల వద్దో లేదా పార్టీ కార్యకర్తల వద్దో అప్పు తీసుకొని ఆ కార్యక్రమాలు చేస్తుంటాను,” అని అన్నారు.
జగ్గారెడ్డి చెప్పింది నిజమే అయితే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లనుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా తమ స్వార్జితంతోనో లేదా దాతల నుంచి విరాళాలు సేకరించి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ జగ్గారెడ్డి అభిమానులు, రెక్కాడితే కానీ డొక్కాడని కార్యకర్తలు, అభిమానుల (?) దగ్గర అప్పులు తీసుకొని సేవ కార్యక్రమాలను చేస్తున్నానని, చెప్పడం ఆలోచింపజేస్తోంది. తిరిగి చెల్లిస్తే అది అప్పు అవుతుంది. కానీ జగ్గారెడ్డి తనకు రూ.100 కోట్లు అప్పులు పేరుకుపోయున్నాయని చెప్పుకున్నారు. అంటే ఆయన వారి దగ్గర అప్పు చేస్తున్నారా...లేక బలవంతపు వసూళ్లు చేస్తున్నారా? అనే సందేహం కలుగుతుంది.