
ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేడు మహాబలిపురంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ దక్షిణాది సాంప్రదాయం ప్రకారం తెల్లటి పంచె, తెల్ల చొక్కా ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. జిన్‌పింగ్ కూడా నల్ల ఫ్యాంట్, తెల్ల షర్ట్ ధరించి చాలా నిరాడంబరంగా మోడీని కలిశారు. వారిరువురూ కలిసి మహాబలిపురంలోని శోర్ ఆలయాన్ని, పరిసర ప్రాంతాలలో ఉన్న శిల్పాలను, వర్ణచిత్రాలను సందర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ జిన్‌పింగ్‌కు ఆలయ పౌరాణిక, చారిత్రిక విశిష్టత గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం కొబ్బరి బోండాలు తాగి సేద తీరిన తరువాత ఆలయ ప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. మళ్ళీ శనివారం ఉదయం మహాబలిపురంలోని ఫిషర్‌మెన్ కోవ్ రిసార్ట్స్‌లో వారిరువురి మద్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. జిన్‌పింగ్ గౌరవార్ధం ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం రాత్రి విందుభోజనం ఏర్పాటు చేస్తున్నారు.
ఈరోజు జరిగిన కార్యక్రమాల వలన ప్రధాని మోడీ-జిన్‌పింగ్ మద్య సద్భావన, పరస్పర అవగాహన పెరిగేందుకు దోహదపడుతుంది. రేపు జరుగబోయే కీలక సమావేశానికి ఒకరోజు ముందుగా భారత్ దౌత్యవేత్తలు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా తెలివైన పనే అని చెప్పవచ్చు. కనుక రేపటి సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ అనుకూలంగా వ్యవహరిస్తే మన దౌత్యప్రయత్నాలు ఫలించినట్లే భావించవచ్చు.