
ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె మొదలుపెట్టి అప్పుడే ఆరు రోజులైపోయింది. కానీ అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గడం లేదు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటున్నారు. వీలైనంత త్వరలో ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులను ప్రవేశపెట్టి నడిపించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల, ఉద్యోగ, ఉపాద్యాయ కార్మిక సంఘాల మద్దతు కూడగట్టి త్వరలో తెలంగాణ బంద్ నిర్వహించడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. ఒకవేళ అందరూ సహకరించినట్లయితే ఈనెల 19న రాష్ట్ర బంద్ నిర్వహించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అశ్వతామ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయానికి వెళ్ళి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో సమావేశమయ్యారు. తాము తలపెట్టబోతున్న బంద్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా వారు కోరనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా హాజరయ్యారు. ఇప్పటికే మజ్లీస్ మినహా రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపాయి. హుజూర్‌నగర్ ఉపఎన్నికలలో తెరాసకు మద్దతు ప్రకటించిన సిపిఐ కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల సిఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రకటించింది. కనుక అన్ని పార్టీలు బంద్‌కు మద్దతు పలుకవచ్చు. ఒకవేళ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల మద్దతు కూడా కూడగట్టగలిగితే ప్రభుత్వంపై తప్పకుండా ఒత్తిడి పెరుగుతుంది. దీనిని ప్రభుత్వం ఏవిధంగా ఎదుర్కొంటుందో చూడాలి.