
తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో 30 రోజులపాటు నిర్వహించిన‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతం అవడంతో ఇక నుంచి ఏడాదికి మూడుసార్లు నిర్వహించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రతను పెంచడం, ముఖ్యంగా పాడైన విద్యుత్ స్తంభాలను మార్చడం, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయడంవంటి అనేక పనులను ప్రజలు-అధికారులు-ఉద్యోగుల భాగస్వామ్యంతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ముప్పై రోజుల పాటు యజ్ఞoలా సాగిన ఈ కార్యక్రమం వలన అనేక పల్లెలలో పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. కనుక ఇక నుంచి ప్రతీ ఏడాది జనవరి, జూన్, సెప్టెంబర్ నెలలలో 10 రోజుల చొప్పున పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని సిఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. దీనికోసం ఒకో జిల్లాకు రూ.2 కోట్లు చొప్పున మొత్తం రూ.64 కోట్లు విడుదల చేస్తుందని, ఆ సొమ్ము జిల్లా కలెక్టర్ల వద్ద ఉంటుందని సిఎం కేసీఆర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ విచక్షాధికారంతో గ్రామాల అవసరాలను బట్టి నిధులు విడుదల చేయవచ్చని సిఎం కేసీఆర్ తెలిపారు.