
సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగించాలనే సిఎం కేసీఆర్ నిర్ణయంతో ఇప్పటివరకు దూరదూరంగా ఉంటున్న ఆర్టీసీలోని వివిద కార్మికసంఘాలన్నీ ఏకమయ్యాయి. సిఎం కేసీఆర్ నిర్ణయంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, “ఎప్పుడు కావాలంటే అప్పుడు మమ్మల్ని ఉద్యోగాలలో నుంచి తొలగించడానికి మేము సిఎం కేసీఆర్ ఇంట్లో పాలేర్లం కాదు. ఆర్టీసీలో కార్మికులుగా పనిచేస్తున్నాము. తెలంగాణ ఉద్యమాల సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు పొందిన సిఎం కేసీఆర్ ఇప్పుడు యూనియన్లు వద్దంటూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీని ఏదోవిధంగా ప్రైవేట్ పరం చేసి తన పార్టీ నేతలకు, సన్నిహితులకు కట్టబెట్టాలని సిఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. మమ్మల్ని ఉద్యోగాలు తొలగించే హక్కు ఆయనకు లేదు. ఆర్టీసీలో కొత్తవాళ్లను తీసుకొంటామంటే మేము చూస్తూ ఊరుకోబోము. తెలంగాణ రాష్ట్రం...ఆర్టీసీ ఆయన సొంత జాగీరు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చరిత్రలో ఎంతోమంది నియంతలకు పట్టిన గతే సిఎం కేసీఆర్‌కు పట్టడం ఖాయం. ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవడానికి కార్మికులు అందరూ పోరాటానికి సిద్దం కావాలి,” అని అన్నారు.
ఆర్టీసీ ఐకాసలోని 16 మంది ముఖ్యనేతలు సోమవారం ఉదయం ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహారా దీక్షకు కూర్చోవాలనుకున్నారు. కానీ పోలీసులు వారికి అనుమతి నిరాకరించడంతో వారు బస్ భవన్‌లో సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ గురించి చర్చించుకొంటున్నారు. మరికొద్దిసేపటిలో వారు తమ కార్యాచరణను ప్రకటించనున్నారు.