
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తిరిగి విధులలో చేరడానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఇచ్చిన గడువు ముగిసింది. గడువులోగా చేరనివారందరూ స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకున్నట్లు భావించి వారి స్థానాలలో కొత్త ఉద్యోగులను నియమిస్తామని రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించినప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఎవరూ విధులలో చేరలేదు. దాంతో తాము ఐకమత్యంగా ఉన్నామని, ప్రభుత్వంతో పోరాటానికి వెనుకాడబోమని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పినట్లయింది.
ఈ పరిణామంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ యూనియన్ లీడర్ల కారణంగానే కార్మికులు సమ్మెకు దిగారని, కొందరు నాయకుల కారణంగానే ఆర్టీసీకి మరింత నష్టం వస్తోందని అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిన తరువాత ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి భవిష్య కార్యాచరణ ప్రకటించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు పాల్పడటం సరికాదు. ఒకవేళ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించాలనుకుంటే ముందుగా నన్నే తొలగించాలని కోరుతున్నాను. మా సమస్యలను పరిష్కరించేవరకు మేము ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దంగా ఉన్నాము," అని అన్నారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల తదుపరి కార్యాచరణ ఈవిధంగా ఉండబోతోంది.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి వరుసగా అన్ని రాజకీయ పార్టీల, ట్రేడ్ యూనియన్, విధ్యార్ధి సంఘాల నేతలను కలిసి సమ్మెకు మద్దతు కోరుతారు. మధ్యాహ్నం 11 గంటలకు ట్రేడ్ యూనియన్ నేతలతో రౌండ్ టేబిల్ సమావేశం. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలో అన్ని డిపోలవద్ద ఆర్టీసీ కార్మికులు కుటుంబాలతో కలిసి బతుకమ్మ ఆడి సమస్యను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం.
సోమవారం ఉదయం 8 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన తరువాత ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తామని తెలిపారు.