
రాష్ట్ర ఐటి, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం సాయంత్రం సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లో తెరాస అభ్యర్ధి సైదిరెడ్డి తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చిరకాలంగా ప్రతినిధ్యం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి ఏమీ చేయలేదు. ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించలేదు. గత 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా హుజూర్‌నగర్ అభివృద్ధి గురించి నాతోకానీ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నడూ మాట్లాడలేదంటే ఆయనకు నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఆసక్తి లేదని అర్ధమవుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎంతసేపు స్వీయ ప్రతిష్ట, రాజకీయాలే ముఖ్యం తప్ప హుజూర్‌నగర్ ప్రజల సమస్యలు పట్టవు.
కానీ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో తనను గెలిపిస్తే రాష్ట్రనికి ముఖ్యమంత్రి అవుతానని, ఆ తరువాత కేంద్రమంత్రి అవుతానని అప్పుడు హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచారు. కానీ ఈసారి మాత్రం వదినమ్మ పద్మావతీకి ఓటమి తప్పదు. ఈసంగతి వారిరువురికీ తెలుసు.
సైదిరెడ్డి గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు. అదే కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ మీ సమస్యలని పరిష్కరించదు. వారు మిమ్మల్ని పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీకి ‘జీ హుజూర్ ‘ అంటే ప్రజలే నష్టపోతారు కనుక ఈసారి గులాబీజెండాను చేతబట్టుకొని ‘జై హుజూర్‌నగర్’ అని నినదిస్తూ తెరాస అభ్యర్ధి సైదిరెడ్డిని గెలిపించుకొందాము,” అని అన్నారు.
కేటీఆర్ రోడ్ షోకు హుజూర్‌నగర్‌లో లింగగిరి రోడ్డు నుంచి ఇందిరా చౌక్ వరకు రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. మంత్రి కేసీఆర్ ప్రసంగిస్తున్నప్పుడు, జనాలు ఉత్సాహంతో ఈలాలు, కేకలు వేస్తూ చప్పట్లతో హర్షధ్వానాలు తెలియజేశారు.