.jpg)
శుక్రవారం సాయంత్రం సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీతో సుమారు గంటసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీకి నిధులు, నియామకాలు, ప్రాజెక్టులు, రిజర్వేషన్లు వగైరా అనేక అంశాలకు సంబందించి పెద్ద వినతిపత్రాన్ని ఇచ్చారు. ఆ జాబితాలోకృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి, జహీరాబాద్ నిమ్జ్‌కు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ కలిపి సుమారు రూ.30,000 కోట్లు వరకు ఉంటాయి.
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులలో దేనికో ఒక దానికి జాతీయహోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్), కరీంనగర్‌లో ఐఐఐటి, హైదరాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అన్ని జిల్లాలలో నవోదయ విద్యాలయాలు, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు.
ముస్లింలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ శాతం పెంచాలని కోరారు. చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కోరారు. హైకోర్టు జడ్జీల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా అనేక అంశాలకు సంబందించి ప్రధాని నరేంద్రమోడీతో సిఎం కేసీఆర్ కూలకుశంగా చర్చించి, రాష్ట్రాభివృద్ధికి సహకరించవలసిందిగా కోరారు. అంతకు ముందు కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు సికింద్రాబాద్‌లో రోడ్లు, స్కైవేల అభివృద్ధికి రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు.