
ప్రభుత్వం-ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో నేటి నుంచిరాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె మొదలయింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో, ఉద్యోగులు, విద్యార్ధులు, ఇతర పనుల కోసం బయటకు వెళ్ళేవారికి ఇబ్బందులు మొదలయ్యాయి. బస్సులు నిలిచిపోవడంతో ఆటోలు, ప్రైవేట్ బస్సుల వాళ్ళు రేట్లు పెంచేశారు. దాంతో ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి.
పండుగ సమయంలో ఆర్టీసీ సమ్మెకు దిగడం హైదరాబాద్ మెట్రో సంస్థకు కూడా వరంగా మారింది. బస్సులు తిరుగకపోవడంతో సహజంగానే నగర ప్రజలందరూ మెట్రోను ఆశ్రయిస్తారు కనుక నేటి నుంచి అదనపు సర్వీసులు నడిపించడం మొదలుపెట్టింది. శనివారం తెల్లవారుజామున 5.30 నుంచి అర్ధరాత్రి 12.30 వరకు మెట్రో సర్వీసులు నడిపిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదనపు రద్దీని తట్టుకోవడం కోసం అదనపు టికెట్ కౌంటర్లు, టికెట్ ఇచ్చే మెషిన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఊహించినట్లుగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతో చాలా కటినంగా వ్యవహరించబోతున్నట్లు నిన్న రాత్రి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో స్పష్టమైంది. సమ్మె చట్ట వ్యతిరేకం కనుక సమ్మె చేసే కార్మికులందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగించి వారి స్థానాలలో కొత్త ఉద్యోగులను నియమించుకొంటామని ఆర్టీసీ ఎండీ తీవ్రమైన హెచ్చరిక చేశారు. పండుగ వేళలో సమ్మె వలన ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదనే ఆలోచనతో 9,000 ప్రైవేట్ బస్సులను నడుపబోతున్నామని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీసీ పాపారావు తెలిపారు.
నేటి నుంచి రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద కర్ఫ్యూ విధిస్తున్నట్లు డిజిపి మహేందర్ రెడ్డి ప్రకటించినప్పటికీ, ఈరోజు ఉదయం 6 గంటలకే ఆర్టీసీ కార్మికులు డిపోల వద్దకు చేరుకొని బస్సులు బయటకు వెళ్లకుండా బైటాయించి ఆందోళన చేపట్టారు. బస్సులను నడిపించేందుకు సిద్దపడినవారిని అడ్డుకున్నా లేదా బస్సులపై దాడులు చేసినా కార్మికులను ఉపేక్షించబోమని పోలీస్ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ప్రస్తుతం అన్ని డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏది ఏమైనపటికీ, ప్రభుత్వం, కార్మిక సంఘాల పంతాల కారణంగా సామాన్యప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇబ్బందులు పడాలో తెలీని పరిస్థితి.