
ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులకు, త్రిసభ్య కమిటీకి మద్య వరుసగా మూడురోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కమిటీ సభ్యులు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నందున వారితో ఈరోజు జరిగిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. వారి పరిస్థితిని మేము కూడా అర్ధం చేసుకోగలము. అందుకే మా సమస్యలను, డిమాండ్లను వారికి తెలియజేసి ప్రభుత్వాన్ని ఒప్పించవలసిందిగా కోరాము. ప్రభుత్వం తరపునుంచి ఇంతవరకు ఎటువంటి నిర్ధిష్టమైన హామీ లభించనందున ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె యధాతధంగా కొనసాగుతుంది.
మాపై ఎస్మా, పిడీ యాక్ట్ ప్రయోగిస్తామనే ప్రభుత్వ బెదిరింపులకు మేము భయపడబోము. అవేమీ మాకు కొత్త కాదు. గతంలో కూడా వాటిని మేము ఎదుర్కొని పోరాడాము. ఇది మా జీతాల పెంచుకోవడం చేస్తున్న సమ్మె కాదు. ఒకప్పుడు తెలంగాణ సాధన కోసం అందరం కలిసికట్టుగా పోరాడాము. ఇప్పుడు ఆర్టీసీని బ్రతికించుకోవడానికి పోరాడుతున్నాము. కనుక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వోద్యోగులు, ఉపాద్యాయులు, కార్మిక సంఘాలు అందరూ కూడా మా పోరాటానికి సంఘీభావం తెలిపి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలో అన్ని డిపోలలో బస్సులు నిలిపివేస్తాము.
ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వింటున్నాము. మా సమ్మెను దెబ్బతీయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినా మేము సహించబోము. తాత్కాలిక ఉద్యోగాలకు ఆశపడి మా సమ్మెను దెబ్బ తీయవద్దని తోటికార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే, మా సమ్మె ఫలించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లయితే, అనేక డ్రైవర్, కండెక్టర్ పోస్టులు శాస్విత ప్రాతిపదికన భర్తీ అవుతాయి. దాని వలన అనేకమందికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. మీడియా మిత్రులు కూడా మా న్యాయమైన డిమాండ్లకు సంఘీభావం తెలపాలని కోరుతున్నాము,” అని అశ్వథామరెడ్డి అన్నారు.