9.jpg)
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి (టిజేఎస్)మద్దతు ప్రకటించింది. టిజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈవిషయం స్వయంగా ప్రకటించారు. కోదండరాం మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో అప్రజాస్వామిక, నియంతృత్వ పాలన సాగిస్తున్న తెరాస సర్కార్‌కు ఈ ఉప ఎన్నికలలో గుణపాఠం చెప్పేందుకు అవకాశం లభిస్తే, తెరాసకు మద్దతు ప్రకటించి సిపిఐ చాలా తప్పు చేసింది. ప్రజల తరపు నిలబడి తెరాస సర్కార్‌తో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే మేము మద్దతు ఇవ్వాలని నిర్ణయించాము. తెలంగాణలో అధికారం తెరాస ప్రభుత్వానికి కాక సిఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకే ఇచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలలో తెరాసకు మరోసారి గర్వభంగం తప్పదు,” అని అన్నారు.
ఈ ఉప ఎన్నికలలో సిపిఎం కూడా నామినేషన్ వేసినప్పటికీ అది తిరస్కరణకు గురవడంతో, తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా టిడిపి కోరింది. త్వరలోనే దీనిపై తమ నిర్ణయం ప్రకటిస్తామని సిపిఎం ప్రకటించింది. ఒకవేళ మద్దతు ప్రకటిస్తే, అప్పుడు బిజెపి ఒక్కటే ఒంటరిగా పోటీ చేయవలసి ఉంటుంది.