
టిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించేందుకు సోమేష్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ బుదవారం చర్చలు ప్రారంభించింది. కానీ ఊహించినట్లే కమిటీ సభ్యులు ప్రభుత్వం తరపున ఎటువంటి నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేకపోవడంతో కార్మిక సంఘాల నేతలు తీవ్ర అసహనానికి లోనయ్యారు. తాము లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలనే ఆసక్తికంటే సమ్మెను ఏవిధంగా ఆపుచేయాలనే ఆలోచనే కమిటీ సభ్యులలో కనిపించిందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి అన్నారు.
సమ్మె విరమించకపోతే తమ వద్ద ప్లాన్-ఏ, ప్లాన్-బి సిద్దంగా కమిటీ సభ్యులు ఉన్నాయని చెప్పడాన్ని కార్మిక సంఘాల నేతలు తప్పు పట్టారు. దీనిని బట్టి ప్రభుత్వం కార్మికులను భయపెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోందని అర్ధమవుతోందని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే తమ డిమాండ్‌తో సహా ఇతర సమస్యలపై ప్రభుత్వం తరపున కమిటీ సభ్యులు నిర్ధిష్టమైన హామీ ఇవ్వనందున రేపు అర్ధరాత్రి నుంచి సమ్మె యధాతధంగా మొదలవుతుందని అశ్వథామరెడ్డి తెలిపారు.