
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలకు సోమవారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి మొత్తం 119 మంది నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో కొందరు అభ్యర్ధులు 2-3 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూటినీలో 76 నామినేషన్లు మిగిలాయి. మళ్ళీ వాటిలో సరైన పత్రాలు, వివరాలు లేనికారణంగా 45 నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్లు తిరస్కరింపబడిన వారిలో సిపిఎం అభ్యర్ధి పారుపల్లి శేఖర్ రావు, తెలంగాణ ఇంటీపార్టీ అభ్యర్ధి సాంబశివ గౌడ్, ఆమాద్మీ అభ్యర్ధి ఎల్.వెంకటేశ్వరులతో సహా పలువురు స్వతంత్ర అభ్యర్ధులున్నారు. వారందరూ ఎన్నికల కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి అధికారులు తమ నామినేషన్లు తిరస్కరించారని వారు ఆరోపించారు.
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల బరిలో చివరికి 31 మంది అభ్యర్ధులు మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం వరకు గడువు ఉంది. అది ముగిసేలోగా ఇంకా ఎంతమంది బరిలో నుంచి తప్పుకోంటారో చూడాలి. సిపిఎం అభ్యర్ధి పారుపల్లి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురవడంతో సిపిఎం నేతలు షాక్ అయ్యారు. ఈనెల 21న పోలింగ్ జరుగుతుంది. 24న ఫలితాలు వెల్లడవుతాయి.