5.jpg)
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల నామినేషన్ల దాఖలు కార్యక్రమం కూడా పూర్తయిపోయింది కనుక ఇక అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం మొదలుపెట్టాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెరాస, కాంగ్రెస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉంది. ఈ ఉప ఎన్నికలలో తెరాసను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీలో కొందరు ప్రయత్నిస్తున్నారు. కనుక పైకి రెండూ శత్రువులలాగ పరస్పరం కత్తులు దూసుకొంటున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తెరాసకు బీ-టీంగా వ్యవహరిస్తోంది. ఆ రెండింటి కుట్రలను త్వరలో మేము బయటపెడతాము. తెరాస తండ్రీకొడుకుల పార్టీ అయితే కాంగ్రెస్ తల్లీకొడుకుల పార్టీ. తెరాస గెలిస్తే కేసీఆర్, కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ప్రయోజనం పొందుతారు తప్ప నియోజకవర్గం ప్రజలు కాదు. కనుక ప్రజలకు సేవ చేయడానికి తన ఉద్యోగాన్ని సైతం వదులుకొని వచ్చిన బిజెపి అభ్యర్ధి డాక్టర్ కె.రామారావుకు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా హుజూర్‌నగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను," అని అన్నారు.