
తెలుగు యువత అధ్యక్షుడు ట్ వీరేందర్ గౌడ్ పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకి పంపించారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ అవసరాలను మాత్రమే చూసుకొంటూ ఎన్టీఆర్ ఆశయాలకు, సిద్దాంతాలకు పూర్తిభిన్నంగా ముందుకు సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులలో టిడిపి ఇమడలేక పార్టీని విడిచిపెడుతున్నానని లేఖలో పేర్కొన్నారు.
అయితే రాష్ట్రంలో టిడిపి భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో యువకుడైన వీరేందర్ గౌడ్, తన భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని బిజెపిలో చేరాలనే ఆలోచనతోనే టిడిపిని వీడుతున్నారని చెప్పవచ్చు. వచ్చేనెల 3వ తేదీన ఆయన డిల్లీలో కేంద్రహోంమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వీరేందర్ గౌడ్ తనకు పట్టున్న ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటే, చంద్రబాబు ఆదేశం మేరకు చేవెళ్ళ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో టిడిపి పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతుండటంతో వీరేందర్ గౌడ్ కూడా తన దారి తాను చూసుకోవడానికి సిద్దం అవుతున్నారు అంతే! ఇప్పుడు ఏ పార్టీకి సిద్దాంతాలు, ఆశయాలు ఉన్నాయి?