అక్టోబర్ 5 నుంచి టిఎస్ ఆర్టీసీ సమ్మె షురూ

వచ్చే నెల 4వ తేదీ అర్ధరాత్రి నుంచి టిఎస్ ఆర్టీసీ నిరవదిక సమ్మె ప్రారంభం కాబోతోంది. ఆదివారం ఉదయం మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో జరిగిన కార్మిక సంఘాల జెఏసి సమావేశంలో ఈ నిర్ణయం  తీసుకున్నారు. టిఎస్ ఆర్టీసీను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్దం అవుతున్నాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు తిప్పబోమని కార్మిక సంఘాల నేత, జేఏసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమ్మెలో ఆర్టీసీలోని అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్రంలోని 97 డిపోలలో పనిచేస్తున్న 50,000 మంది ఈ సమ్మెలో పాల్గొంటారని చెప్పారు. రెండు వారాల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితులలోనే సమ్మె చేయవలసి వస్తోందని, కనీసం ఇప్పటికీ ప్రభుత్వం స్పందించాలని జేఏసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు.