
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ. రాష్ట్రంలో మహిళలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకొంటున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం)మండలంలో పారుపల్లి గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. అయితే అక్కడ బతుకమ్మ ఆడింది మహిళలు కాదు...అలాగే ఆడిపాడింది బతుకమ్మ చుట్టూ కాదు. గ్రామ సర్పంచ్ రమేశ్‌తో సహ కొందరు స్థానిక నేతలు మద్యం త్రాగి, మద్యం సీసాల చుట్టూ తిరుగుతూ 'సారా...సారమ్మ...' అంటూ చిందులు వేశారు.
బతుకమ్మ పండుగను ఈవిధంగా కించడాన్ని స్థానిక మహిళలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ రమేశ్‌తో సహా దీనిలో పాల్గొన్నవారందరిపై పోలీసులు కేసులు నమోదు చేసి కటినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే తాము బతుకమ్మ వేడుకలను రాత్రి 8 గంటలకే ముగించామని, రాత్రి 12 గంటల తరువాత తమలో ఒకరి పుట్టిన రోజులు వేడుకలు జరుపుకున్నామని, దానినే ఎవరో గిట్టనివారు ఫోటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని గ్రామ సర్పంచ్ రమేశ్ వాదిస్తున్నారు. అయితే తమ చర్యలను ఎంతగా సమర్ధించుకున్నప్పటికీ వారు బతుకమ్మ పండుగను కించపరిచినట్లు ఫోటోలు వీడియో చూస్తే అర్ధమవుతూనే ఉంది.