సిపిఐ మద్దతు కోరిన తెరాస!

వచ్చే నెల 21న జరుగబోయే హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలకు తెరాస, కాంగ్రెస్‌, బిజెపి, టిడిపిలు అభ్యర్ధులు ప్రకటించడంతో ఎన్నికల సంగ్రామానికి అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకొంటున్నాయి. రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న అధికార తెరాస చాలా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకొంది. ఈ ఉప ఎన్నికలలో సిపిఐ మద్దతు కోరింది. తెరాస నేతలు కే. కేశవరావు, నామా నాగేశ్వరరావు, వినోద్ కుమార్ ఆదివారం హైదరాబాద్‌లో సిపిఐ కార్యాలయానికి వెళ్ళి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డిని కలిసి మద్దతు కోరారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో సిపిఐ పోటీ చేయబోవడంలేదు కనుక దాని మద్దతు కోరాలని సిఎం కేసీఆర్‌ సూచన మేరకు తాము వచ్చినట్లు వారు తెలిపారు. వారిని సాధారంగా ఆహ్వానించిన చాడా వెంకటరెడ్డి తదితరులు, దీనిపై తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించుకున్నాక తమ నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు.