
తెలంగాణ ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెతో సహా 17 మంది ఈఎస్ఐ ఉద్యోగులు, మరో నలుగురు బయటి వ్యక్తులు కలిసి నకిలీ బిల్లులతో భారీగా మందులు కొంటూ సుమారు రూ.10 కోట్లకు పైగా సొమ్మును స్వాహా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా బుదవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏక కాలంలో ఆమె కార్యాలయంలో , షేక్ పేటలోని ఆమె నివాసంలో, హైదరాబాద్, వరంగల్ ఈఎస్ఐ కార్యాలయాలలో, 23 మంది ఈఎస్ఐ ఉద్యోగుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి అనేక కీలకపత్రాలు, నకిలీ బిల్లులు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు దేవికారాణిని అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
ఆమెతో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, పలువురు ఈఎస్ఐ ఉద్యోగులు, అమ్నీ మెడికల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్, తేజ్ ఫార్మా కంపెనీకి చెందిన సుధాకర్ రెడ్డి, నాగరాజు, నరేందర్ రెడ్డి అనే మరో ఇద్దరు వ్యక్తులు ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నారని ఏసీబీ అధికారులు ప్రాధమికంగా దృవీకరించారు.
దాదాపు ఏడాదిగా ఈ అవినీతి భాగోతం సాగుతోంది. ఈఎస్ఐలో ఉన్నతస్థాయి అధికారులే దీనిని నడిపిస్తుండటంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఈఎస్ఐ ఆసుపత్రులలో అధికారులు, ఉద్యోగులతో కలిసి చాలా సులువుగా సంస్థ సొమ్మును దోచుకోగలిగారు. మందులు అవసరం లేకపోయినా బారీగా కొనడం లేదా ఫార్మా కంపెనీలు, మెడికల్ రిప్రసెంటివ్ల సాయంతో మందులు కొన్నట్లు నకిలీ బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఏసీబీ అధికారులు కనుగొన్నారు.
ఈ అవినీతి భాగోతం కేవలం హైదరాబాద్‌కే పరిమితం అయ్యిందనుకోలేము. పారిశ్రామికవాడలున్న మిగిలిన జిల్లాలలో కూడా కార్మికులు ఉంటారు కనుక ఆ ప్రాంతాలలో ఉండే ఈఎస్ఐ ఆసుపత్రులు, కార్యాలయాలలో ఇటువంటి అవినీతి, అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఏసీబీ అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఈఎస్ఐ ఉద్యోగులు, కార్మికులు కోరుతున్నారు.