
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు, వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాలలో ఎటువంటి అవకతవకలు జరుగలేదని, అభ్యంతరాలన్నిటినీ పరిష్కరించామని కనుక మున్సిపల్ ఎన్నికలకు అనుమతించాలని హైకోర్టును అభ్యర్ధించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని తెలిపింది.
కానీ వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాలలో చాలా అవకతవకలు జరిగాయని, వాటిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం వాటిని సవరించకుండా సవరించామని అబద్దాలు చెపుతూ హైకోర్టును కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలలో ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిన సంగతిని ఆయన న్యాయస్థానానికి గుర్తు చేసి ఆ లోపాలన్నిటినీ సవరించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ కేసుపై మళ్ళీ రేపు విచారణ జరుగుతుంది. కనుక హైకోర్టు అనుమతిస్తేనే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. లేకుంటే మరింత ఆలస్యం కావచ్చు.