తెరాస కౌరవులు వస్తారు జాగ్రత్త: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో పద్మావతీ రెడ్డి పోటీచేయబోతున్నందున భార్యను గెలిపించుకోవడం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా ప్రయత్నించడం సహజం. గతంలో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఆయన చేతిలో స్వల్పతేడాతో ఓడిపోయినందున తెరాస అభ్యర్ధి సైదిరెడ్డిని గెలిపించుకోవడం కోసం తెరాస కూడా గట్టిగా ప్రయత్నించడం తద్యం. కనుక హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలు కాంగ్రెస్‌, తెరాసలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. కనుక ప్రచారం, విమర్శలు, పోటీ అన్ని చాలా తీవ్రంగానే ఉంటాయి.

ఈ నేపధ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో మీడియాతో మాట్లాడుతూ, “త్వరలోనే హుజూర్‌నగర్‌కు తెరాస కౌరవసేన తరలివస్తుంది. పదిమంది మంత్రులు తరలివచ్చి సైదిరెడ్డి తరపున ప్రచారం చేసినా కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడనవసరంలేదు. తెరాసలో ఎవరూ లేనట్లు ఆంధ్రాకు చెందిన సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడమే కాకుండా కడప జిల్లాకు చెందిన కోదాడ ఎస్పీ సుదర్శన్ రెడ్డి, శ్రీకాకుళానికి చెందిన హుజూర్‌నగర్‌ సిఐ రాఘవరావుల అండదండలతో కాంగ్రెస్‌ కార్యకర్తలను భయబ్రాంతులను చేయాలని తెరాస ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత మాత్రన్న తెరాస ఏదైనా చేయవచ్చనుకుంటే కుదరదు. పోలీసులను అడ్డంపెట్టుకొని కాంగ్రెస్‌ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడితే వారికి అండగా నిలబడి ప్రభుత్వంతో పోలీసులతో పోరాడుతాము. ఎవరెంత భయపెట్టినప్పటికీ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 30,000 మెజార్టీతో గెలవడం ఖాయం. అందుకోసం నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని,” అని అన్నారు.