తెలంగాణ పోలీసులకు ఏపీలో శిక్షణ

సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో కొన్ని కీలకనిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో త్వరలో 16,926 మంది భర్తీ కాబోతున్నారు. వారందరికీ ఒకేసారి శిక్షణ ఇవ్వడం సాధ్యం కాదు. అలాగని దశలవారీగా శిక్షణ ఇవ్వాలనుకుంటే వారు శిక్షణ పూర్తిచేసుకొని ఉద్యోగాలలో చేరేందుకు చాలా సమయం పడుతుంది. కనుక ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారిలో 4,000 మందికి ఏపీలో శిక్షణ ఇవ్వాల్సిందిగా సిఎం కేసీఆర్‌ కోరగా అందుకు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. కనుక నియామక ప్రక్రియ పూర్తవగానే వారిలో 4,000 మంది ఏపీలో శిక్షణ పొందబోతున్నారు. 

దాదాపు నాలుగు గంటలసేపు సుదీర్గంగా జరిగిన సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు నదీజలాల తరలింపు, వినియోగంపై కూడా లోతుగా చర్చించారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి శ్రీశైలం రిజర్వాయరుకు తరలించడం ద్వారా గరిష్టంగా నీటిని సద్వినియోగపరుచుకోవాలని నిర్ణయించారు. అతితక్కువ భూసేకరణతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా ఈ ప్రాజెక్టును రూపొందించుకొని, దాని నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరువురు ముఖ్యమంత్రులు సూత్రప్రాయంగా అంగీకరించారు.

త్వరలో జరుగబోయే తిరుమల బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా రావలసిందిగా సిఎం కేసీఆర్‌ను ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానించారు.