కేంద్రప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

కేంద్రప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతునట్లు కేంద్రహోంమంత్రి అమిత్ షా సూచన ప్రాయంగా తెలిపారు. డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అన్ని అవసరాలకు ఒకే డిజిటల్ గుర్తింపు కార్డును రూపొందించాలనుకొంటున్నట్లు తెలిపారు. 

ప్రస్తుతం ఆధార్, రేషన్, ఓటర్ డ్రైవింగ్ లైసెన్స్, ఏటిఎం, పాన్ కార్డ్ ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో కార్డు...వాటిని  పొందేందుకు ప్రజలు, జారీ చేసేందుకు ఉద్యోగులు శ్రమించవలసి వస్తోంది. పైగా ఉద్యోగులపై పనిభారం, ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. కనుక వాటన్నిటి స్థానంలో ఒకే ఒక డిజిటల్ గుర్తింపు కార్డును ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. తద్వారా ఒకే దేశం-ఒకే కార్డు విధానం అమలులోకి వస్తుందని అన్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆలోచనస్థాయిలోనే ఉందని అమిత్ షా తెలిపారు. 

వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణన కార్యక్రమంలో కాగితాలకు బదులు డిజిటల్ పద్దతిలో ప్రజల వివరాలను నమోదు చేస్తామని అమిత్ షా తెలిపారు. జననమరణాలను జనాభాలెక్కలలో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యేవిధంగా చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. తద్వారా పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పధకాలు, ఓటర్ల జాబితాలు, బ్యాంక్ తదితర అన్ని వ్యవహారాలలో కొత్తగా జన్మించిన, చనిపోయినవారికి సంబందించిన అన్ని వివరాలు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయని అన్నారు. ఈ జననమరణ జాబితాలను ఓటర్ల జాబితాలతో కూడా అనుసంధానం చేయడం ద్వారా ఆ ప్రక్రియను కూడా సులభతరం చేసి దానిలో లోపాలను సవరించవచ్చని భావిస్తున్నట్లు కేంద్రహోంమంత్రి అమిత్ షా తెలిపారు. 

ఈ బహుళ ప్రయోజన డిజిటల్ గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టగలిగితే చాలా మంచిదే. కానీ రాజకీయపార్టీలే దానికి అభ్యంతరాలు చెప్పవచ్చు. వాటివలన దేశప్రజల పూర్తివివరాలు కేంద్రప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోతాయని, కేంద్రప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని దుర్వినియోగపరిచే అవకాశం ఉంటుందని, ప్రజల గోప్యనీయతకు భంగం కలుగుతుందని వాదించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే, పలురకాల గుర్తింపు కార్డులద్వారా దేశప్రజల సమగ్ర సమాచారం కేంద్రరాష్ట్రప్రభుత్వాల చేతుల్లోనే ఉన్నాయి. కనుక దీనివలన ప్రజలకు ఎంతో కొంత లాభమే తప్ప కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. దేశంలో 133 కోట్ల మందికి ఈ డిజిటల్ గుర్తింపు కార్డులను ఏర్పాటు చేయడం చాలా భారీ ఖర్చు, శ్రమతో కూడుకున్నదే కనుక కేంద్రప్రభుత్వం దీనిని ఎప్పటికి అమలుచేస్తుందో చూడాలి.