2.jpg)
మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం హుజూర్నగర్ నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమైనప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “హుజూర్నగర్కు ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి చేసిందేమీ లేదు. కానీ మన ప్రభుత్వం నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల అభివృద్ధికి అనేకచర్యలు చేపట్టింది. యాదాద్రిలో మనం విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మిస్తుంటే కాంగ్రెస్ నేతలు అడ్డుకొంటామని బెదిరిస్తున్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారంగా మిషన్ భగీరధ ద్వారా స్వచ్చమైన మంచినీటిని అందజేయాలని మనం ప్రయత్నిస్తుంటే దానినీ కాంగ్రెస్ నేతలు తప్పు పడుతున్నారు. మూడు జిల్లాలలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నాము.
జిల్లాలోని కాంగ్రెస్ నేతల అరాచకాలకు అడ్డుకట్ట వేసి అభివృద్ధిపదంలో ముందుకు సాగాలంటే తెరాస అభ్యర్ధి సైదిరెడ్డిని ప్రజలు గెలిపించుకోవాలి. కాంగ్రెస్ నేతలు సైదిరెడ్డి స్థానికతపై దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన స్థానిక ప్రజలతో కలిసిపోయి వారి సమస్యల పరిష్కారానికి చాలా కృషి చేస్తున్నారనే సంగతి ప్రజలకు కూడా తెలుసు. హుజూర్నగర్ ఉప ఎన్నికలలో తెరాస అభ్యర్ధి సైదిరెడ్డి గెలుపు అనివార్యం...తధ్యం,” అని అన్నారు.