కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి తెలంగాణ సిఎం కేసీఆర్‌కు ఆదివారం ఒక బహిరంగలేఖ వ్రాశారు. కానిస్టేబుల్ నియామకాలకు సంబందించి మెరిట్ లిస్టును ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని రేవంత్‌ రెడ్డి ఆ లేఖలో కోరారు. గత ఏడాది మే నెలలో పోలీస్ శాఖలోని 16,926 వివిద పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసి పరీక్షలు నిర్వహించగా వాటిలో 90,000 మంది ఉత్తీర్ణులైనట్లు ప్రకటించింది. కానీ నేటికీ మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్క్స్ ప్రకటించకపోవడంతో పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఏడాదిన్నర గడిచినప్పటికీ ఇంతవరకు నియామక ప్రక్రియ పూర్తిచేయకపోవడంతో వివిద జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్ధులు హైదరాబాద్‌లో మకాం వేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ అధికారుల నుంచి స్పందనలేకపోవడంతో అభ్యర్ధులు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనవుతున్నారు. ఈ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులైనట్లు ప్రకటించడంతో వాటి కోసం ఎదురుచూస్తూ భారంగా రోజులు గడుపుతున్నారు. ఈ కారణంగా వారు వేరే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలో వద్దో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేసి నెలరోజులైంది. కానీ ఆయన నుంచి స్పందన రాకపోవడంతో ఈవిధంగా బహిరంగలేఖ ద్వారా అభ్యర్ధుల సమస్యను మీ దృష్టికి తీసుకువస్తున్నానని ఇకనైనా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని రేవంత్‌ రెడ్డి సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.