
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలకు శనివారం షెడ్యూల్ ప్రకటించడంతో తక్షణమే సూర్యాపేట జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది కనుక జిల్లాకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు చేయరాదని, జిల్లాలో మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనరాదని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి ప్రకటనలు చేయరాదని సూచించారు. అలాగే జిల్లాలో ఉద్యోగులను, అధికారులను బదిలీ చేయరాదని సూచించారు. 2019, జనవరి 1నాటి ఓటర్ల జాబితా ప్రకారమే హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని రజత్ కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీలు, వాటి నేతలు లేదా వారి ప్రతినిధులు ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఎవరైనా గుర్తిస్తే సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.