
కరీంనగర్ కాంగ్రెస్ నేత కర్ర రాజశేఖర్ ఆయన అనుచరులు శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్, బిజెపిలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదు. ఇక రాష్ట్ర బిజెపి నేతల మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి. హడ్డీమార్ గుడ్డిదెబ్బ అన్నట్లు లోక్‌సభ ఎన్నికలలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోగానే వారు ఎగిరెగిరిపడుతున్నారు. తెరాసలో మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగానే ఏడు ఎంపీ సీట్లు కోల్పోయింది తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిలకు ఆదరణ పెరిగినందున కాదు. ఆ విషయం వాళ్ళకు తెలుసు. వాళ్ళకు నిజంగా రాష్ట్రంలో అంత ప్రజాధారణ ఉన్నట్లయితే లోక్‌సభ ఎన్నికల తరువాత వెంటనే జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఎందుకు గెలవలేకపోయారు?
బిజెపిలో నిన్న మొన్నటివరకు ప్రజలకు పరిచయమే లేని వ్యక్తులు ఇప్పుడు హటాత్తుగా హీరోలైపోయినట్లు మాట్లాడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే సిఎం కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. గత 18 ఏళ్ళలో ఇలాంటి వాళ్ళను చాలా మందినే చూశాము. రోడ్డు మీద ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతుంటాయి. వాటిని అరుపులకు ఏనుగు భయపడదు. అయినా సిఎం కేసీఆర్ చేసిన తప్పేమిటి? రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం నిరంతరం శ్రమించడం తప్పా?
బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతునన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయా? బిజెపి పాలిత యూపీ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అన్నం, చపాతీలలో కూర, సాంబారుకు బదులు రోజూ ఉప్పు నంచుకు తింటున్నారని అన్ని న్యూస్ ఛానల్స్, పేపర్లలో వచ్చింది కదా? కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బడి పిల్లలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు తింటున్న సన్నబియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్నాము. ఇవేవీ కాంగ్రెస్, బిజెపి నేతల కళ్ళకు కనబడవా?అయినా రాష్ట్రం పట్ల వారికి ఇంత శతృత్వం ఎందుకో నాకు అర్ధం కాదు. రాష్ట్ర బిజెపి నేతల తీరు చూస్తుంటే చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్లుంది. వారి సత్తా ఏపాటిదో త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో చూపిస్తే బాగుంటుంది,” అని కేటీఆర్ అన్నారు.