
రాష్ట్రంలో అన్ని జిల్లాలను హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేయాలనుకొంటున్నామని సిఎం కేసీఆర్ చాలా కాలం క్రితమే చెప్పారు. అందుకు తగ్గట్లుగానే వివిద జిల్లాలలో లభించే వనరులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవాడలను, ఐటి పార్కులను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే రైతులకు 24 గంటలు ఉచితవిద్యుత్, రైతుబంధు పధకం క్రింద పంటపెట్టుబడి అందిస్తోంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురు మందులు వగైరాలు సరఫరాకు తగిన చర్యలు తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వలన రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తులు పెరిగాయి. అయితే నేటికీ వాటికి సరైన ధరలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనుక వివిద ఉత్పత్తులను ముడి సరుకుగా అమ్ముకోవడం కంటే వాటిని ప్రాసెసింగ్ చేసి అమ్ముకున్నట్లయితే రైతులకు ఎక్కువ లాభం వస్తుందని భావించిన సిఎం కేసీఆర్ జిల్లాలవారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని గతంలోనే హామీ ఇచ్చారు. దీనిపై శాసనసభలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ సమాధానం చెప్పారు. వివిద జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల గురించి వివరించారు. ఆ వివరాలు:
1. సిరిసిల్ల: మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్.
2. నర్సంపేట వరంగల్ రూరల్: పండ్లు, మసాలా దినుసుల ప్రాసెసింగ్ యూనిట్.
3. మందపల్లి, సిద్ధిపేట జిల్లా: కూరగాయల క్లస్టర్.
4. నిజామాబాద్ జిల్లా: స్మార్ట్ ఆగ్రో స్పైసస్ పేరుతో పసుపు, మసాలా దినుసులు, పొడుల తయారీ కేంద్రం.
5. మహబూబ్‌నగర్: ఫుడ్ పార్క్.
6. జహీరాబాద్: గుడ్లు, మాంస ఉత్పత్తుల ఫుడ్ పార్క్.
7. మల్లేపల్లి, నల్గొండ జిల్లా: స్వీట్ ఆరంజ్ ప్రాసెసింగ్ యూనిట్.
8. మునుగోడు, దండుమల్కాపూర్, నల్గొండ జిల్లా: ఆగ్రో క్లస్టర్.
9. చందన్ వల్లి, రంగారెడ్డి జిల్లాలో : న్యూట్రాసిటికల్ యూనిట్.
10. సత్తుపల్లి, ఖమ్మం జిల్లా: ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్.
11. బండ తిమ్మాపురం, మెదక్ జిల్లా: స్నాక్స్ అండ్ టిఫిన్స్ యూనిట్.
12. కంపల్లి, రఘునాధపాలెం, మహబూబాబాద్ జిల్లా: మిరప ప్రాసెసింగ్ యూనిట్.