
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మద్య జరుగుతున కీచులాటలు చూస్తుంటే, “కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. అప్పుడప్పుడు తనను తాను ఓడించుకున్నప్పుడే ఇతరపార్టీలు గెలుస్తుంటాయి,” అనే పాత జోక్ గుర్తుకు రాకమానదు. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పాలై, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారినప్పటికీ పార్టీలో నేతలు పదవుల కోసం నిసిగ్గుగా కీచులాడుకోవడం చూసి అందరూ నవ్వుకొంటున్నారు. ప్రస్తుతం పార్టీలో నేతలు రెండుగా చీలిపోయి హుజూర్నగర్ టికెట్, పిసిసి అధ్యక్ష పదవి కోసం కీచులాడుకొంటున్నారు. నిన్నటివరకు డిల్లీలో ఉండి వచ్చిన ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా దానిలో చేరి తనను ఉద్దేశ్యించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు.
“యురేనియం విషయంలో నాకు ఏబీసీడీలు తెలియవని రేవంత్ రెడ్డి ఎందుకన్నారో తెలీదు కానీ ఆయన ఆవిధంగా అంటారని నేను ఊహించలేదు. యురేనియం గురించి ఏమీ తెలియకుండానే నేను డిల్లీ వెళ్ళి పోరాడానా? ఎవరు ఏమి చదువుకున్నారో నాకు తెలీదు కానీ నేను మాత్రం పిహెచ్డి చేశాను. కనీసం ఒక సర్పంచ్ కూడా లేని జనసేన పార్టీ యురేనియంపై సమావేశం నిర్వహిస్తే జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ దానికి వెళ్ళాల్సిన అవసరముందా? వెళ్ళడం వలన ఆ క్రెడిట్ జనసేనకు ఇచ్చినట్లు అయ్యింది కదా? అనే ఉద్దేశ్యంతోనే నేను ఆవిధంగా అన్నాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. పవన్ కల్యాణ్‌తో సెల్ఫీ దిగడానికి నాకు అవకాశం ఇవ్వలేదు కనుకనే నేను ఆయనపై అక్కసు వెళ్ళగక్కానని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నాతోనే సెల్ఫీలు దిగుతుంటారు. పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని నేను ఎవరినీ అడగలేదు. కానీ ఈసారి మాత్రం బీసీలకే ఇవ్వాలని మా అధిష్టానాన్ని కోరుతున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఆ పదవికి అన్నివిధాలా సరైనవారు. ఒకవేళ మా అధిష్టానం నాకు ఆ అవకాశం ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను. ఎందుకంటే పార్టీలో ఎప్పుడూ రెడ్డి సామాజికవర్గానికే పదవులు దక్కుతున్నాయి తప్ప బీసీలకు దక్కడం లేదు,” అని అన్నారు.