ప్రభుత్వలాంఛనాలు వద్దన్న కోడెల కుటుంబ సభ్యులు

మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు నేడు గుంటూరు జిల్లాలోని ఆయన స్వస్థలం నరసారావుపేటలో జరుగనున్నాయి. ఆయన వివిద హోదాలలో ప్రభుత్వంలో పనిచేసినందున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్దపడింది. కానీ ప్రభుత్వ వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్న ఆయన కుటుంబసభ్యులు అధికారిక లాంఛనాలను తిరస్కరించారని  టిడిపి జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు నరసారావుపేటలో కోడెల అంతిమయాత్ర మొదలవుతుందని తెలిపారు. కోడెల మృతిపట్ల ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తలు తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో ఉన్నందున ఆయన అంతిమయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నరసారావుపేట అంతటా భారీగా పోలీసులను మోహరించారు.