
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బిజెపి మంగళవారం సాయంత్రం పటాన్‌చెరులో బహిరంగసభ నిర్వహించనున్నారు. స్థానిక ఎస్వీఆర్ గార్డెన్స్‌లో జరుగబోయే ఈ సభకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర బిజెపి నేతలు హాజరవుతారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెరాస సర్కార్ అధికారికంగా జరుపాలని బిజెపి చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. కానీ జరుపకపోవడంతో మజ్లీస్ పార్టీ మెప్పుకోసమే చేయడం లేదని రాష్ట్ర బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ తెలంగాణ విమోచన దినోత్సవం జరిపినట్లయితే మళ్ళీ ఆనాటి విషాదఘటనలను గుర్తుచేసినట్లవుతుందని, దాని వలన ప్రజల మద్య విభేధాలు ఏర్పడుతాయనే ఆలోచనతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపడంలేదని, కానీ సెప్టెంబర్ 17న తెలంగాణ భవన్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో తెరాస కార్యాలయాలపై మువ్వన్నెల జెండాను ఎగురవేస్తామని సిఎం కేసీఆర్ చెప్పారు. కనుక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపబోదని, కావాలనుకుంటే బిజెపి నిరసనలు జరుపుకోవచ్చని వాటిని ప్రభుత్వం పట్టించుకోదని సిఎం కేసీఆర్ చెప్పారు. కనుక ఈరోజు పటాన్‌చెరులో సభలో సిఎం కేసీఆర్‌పై బిజెపి విమర్శలు చేసుకోవడానికి మరో అవకాశం లభించినట్లే భావించవచ్చు.