కోడెల ఆత్మహత్యలో కొత్తకోణం

మాజీ ఏపీ అస్సెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రమాదకరమైన ఇంజెక్షన్ చేసుకొని ఆత్మహత్య చేసుకోగా అపస్మారకస్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు బసవతారకం ఆసుపత్రికి తరలించారని, వైద్యులు ఆయనను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. 

కానీ ఆయన ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో భార్యతో కలిసి టిఫిన్ చేసిన తరువాత మేడమీద తన గదిలోకి వెళ్ళి తలుపు లాక్ చేసుకొని ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. 

ఆయన మేడమీద తన గదిలోకి వెళ్ళి క్రిందకు రాకపోవడంతో, ఆయన భార్య పైకి వెళ్ళి లోపలకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. కానీ లోపల నుంచి డోర్ లాక్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి గన్‌మెన్‌ పిలిచారు. అతను తలుపులు బద్దలుకొట్టి చూడగా లోపల కోడెల ఫ్యానుకు వ్రేలాడుతూ కనిపించారు. అప్పటికే ఆయన ఊరి వేసుకొని సుమారు 30 నిమిషాలపైనే గడిచి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అంటే అప్పటికే ఆయన చనిపోయినట్లు అర్ధం అవుతోంది. కానీ ఆయనను బ్రతికించుకోవాలనే ఆశతో కుటుంబ సభ్యులు ఆయనను బసవతారకం ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయారు కనుక వైద్యులు చేయగలిగింది ఏమీలేదు. కానీ వారు ఆయన మరణించారనే వార్తను అధికారికంగా ప్రకటించేలోగా ఆయన మృతిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. 

పోలీసులు కోడెల మరణాన్ని ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకొని మేడ మీద ఆయన గదిని, అందులో వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆయన గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు.  ప్రస్తుతం కోడెల శవానికి పోస్ట్ మార్టం జరుగుతోంది. పోస్ట్ మార్టం నివేదిక వస్తే ఆయన మృతిపై పూర్తి స్పష్టత వస్తుంది.