.jpg)
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరినదిపై పాపికొండల విహారయాత్రలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఈ ప్రమాదంలో గల్లంతైన వారికోసం నదిలో గాలిస్తున్న గజఈతగాళ్ళు ఈరోజు ఉదయం నాలుగు మృతదేహాలను వెలికితీశారు. వారిలో ఆరేడు నెలల వయసున్న ఒక చిన్నారి కూడా ఉంది. తాజా సమాచారం ప్రకారం ప్రమాదం జరిగినపుడు పడవలో 64 మంది పర్యాటకులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 23మంది ప్రాణాలతో బయటపడగా మరో 39 మంది గల్లంతయ్యారు.
ఈ ప్రమాదంలో నల్గొండ జిల్లా అనుముల మండలంలోని హాలియా పట్టణానికి చెందిన యువ ఇంజనీర్లు సురభి రవీందర్, రామడుగు గ్రామానికి చెందిన పాశం తరుణ్ రెడ్డి, వరంగల్‌కు చెందిన హేమంత్ గల్లంతయ్యారు. వారి నలుగురు మిత్రులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారందరూ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో అవుట్ సౌర్సింగ్ ఉద్యోగులుగా ఆపనిచేస్తున్నారు. అందరూ కలిసి సరదాగా పాపికొండలు విహారయాత్రకు బయలుదేరి వెళితే అది తీవ్ర విషాదంగా ముగిసింది.