తెలంగాణలో ఆ చట్టం అమలుచేయం: కేసీఆర్‌

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మోటారువాహన చట్టాన్ని  తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయబోమని సిఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు. భారీ పెనాల్టీలు విధించడం వలన ప్రజలు ఇబ్బందులుపడతారని కనుక ట్రాఫిక్ నిబందలలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నట్లు సిఎం కేసీఆర్‌ తెలిపారు. 

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మోటారువాహన చట్టంలో చిన్న చిన్న తప్పులకు కూడా భరించలేనంత భారీగా జరిమానాలు విధిస్తూండటంతో ప్రజలు వాహనాలను బయటకు తీసేందుకే భయపడే పరిస్థితులు దాపురించాయి. ద్విచక్రవాహనదారులు, సరుకు రవాణా చేసే వాహనాల యజమానులే ఎక్కువగా ఈ కొత్తచట్టానికి బాధితులుగా ఉంటున్నారు. 

కొన్ని కేసులలో ఈ జరిమానాలు రూ.25-75,000 వరకు వసూలు చేస్తుండటంతో లారీల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టోల్ గేట్లు, లైసెన్సుల రూపంలో రోడ్డు రవాణాశాఖకు చెల్లించే ఫీజులు, చెక్ పోస్టుల వద్ద లంచాలు, నానాటికీ పెరుగుతున్న డీజిల్, వాహనాల విడిభాగాల ధరలతో తమపై చాలా భారం పడుతోందని, ఇప్పుడు ఏదో వంకతో ఇంతభారీగా జరిమానాలు వసూలుచేస్తే ఇక వాహనాలు అమ్ముకునే దుస్థితి వస్తుందని సరుకు రవాణా చేసే లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరుకు రవాణా వాహనాలపై పడుతున్న ఈ అదనపు భారం అంతిమంగా మళ్ళీ వాటి వినియోగదారులైన సామాన్య ప్రజలపైనే పడుతుందని వేరే చెప్పక్కరలేదు.   

ఇక ద్విచక్రవాహనాదారులకి మరో రకం కష్టాలు. హెల్మెట్, ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి అన్ని ఉన్నా సిగ్నల్ జంప్ చేయాలని ప్రయత్నించారనో, పివిలియన్ రైడర్ హెల్మెట్ పెట్టుకోలేదనో లేదా బండి నెంబర్ ప్లేటు సరిగా లేదనో ఏదో ఓ కారణంతో భారీగా జరిమానాలు విధిస్తుండటంతో ప్రజలు వాహనాలతో రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్నారు. 

అసలే ఆర్ధికమాంద్యం కారణంగా దేశంలో వాహనాల తయారీ, అమ్మకాలు నానాటికీ పడిపోతుంటే, ఈ జరిమానాలను చూసి ప్రజలు కొత్త వాహనాలు కొనేందుకు వెనకాడితే ఆ సంస్థలకు ఇంకా నష్టాలు వస్తాయి. కనుక ఈ జరిమానాలతో కేంద్రప్రభుత్వం ఆదాయం పెంచుకునే ఆలోచన మానుకుంటే మంచిది. తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు ఈ కొత్త మోటారువాహన చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటిస్తున్నాయి.