
మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీ (95) ఆదివారం ఉదయం డిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అధికార ప్రతిపక్షాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్ళి శ్రద్దాంజలి ఘటించారు. ఆదివారం సాయంత్రం డిల్లీలోని లోథి రోడ్డులోని శమశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
రామ్ జెఠ్మలానీ 1923లో సింధ్ ప్రాంతంలోని షికార్‌పూర్ (పాకిస్తాన్)లో జన్మించారు. కరాచీలోని షహానీ న్యాయ కళాశాల నుంచి 17 ఏళ్ళ వయసులోనే న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసిన ఘనుడు ఆయన. కొంతకాలం కరాచీలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన తరువాత 1958లో ముంబై వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇక ఆయన వెనక్కు తిరిగి చూసుకోలేదు. భారత్‌లోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరిగా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆ తరువాత 1977లో రాజకీయాలలోకి ప్రవేశించి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. 1988లో భారత్ ముక్తి మోర్చాను, 1995 పవిత్ర హిందూస్థాన్ కజగం అనే పార్టీలను స్థాపించారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించినందుకు 2013లో బిజెపిని బహిష్కరించబడ్డారు.
రాజకీయాలలో ఆయన పెద్దగా రాణించలేకపోయినా న్యాయవాదిగా మాత్రం ఎనలేని కీర్తిప్రతిష్టలను ఆర్జించారు. అయితే న్యాయవాదిగా ఎంత గొప్ప పేరు సంపాదించారో అంతే అప్రదిష్ట కూడా మూటగట్టుకున్నారు. స్టాక్ మార్కెట్ కుంభకోణాలకు పాల్పడిన హర్షద్ మెహతా, ఖేతన్ పరేఖ్, పార్లమెంటుపై దాడికి పాల్పడిన ప్రొఫెసర్ జిలానీ, రాజీవ్ గాంధీ హంతకులు, ఓ ప్రముఖ మాఫీయా డాన్ వంటి అవినీతిపరులు, సంఘవిద్రోహులు, ఉగ్రవాదుల తరపున వాదించి చాలా చెడ్డపేరు మూటగట్టుకున్నారు. అలాగే అధికార, ప్రతిపక్షపార్టీ అనే బేధం లేకుండా అనేకమంది అవినీతి, హత్యారోపణలు ఎదుర్కొన్న రాజకీయ నాయకుల తరపున వాదించారు. ఆయన జీవితం చివరిదశలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు మూటగట్టుకున్నారు. అయితే న్యాయవాదిగా ఆయన తెలివితేటలకు, ప్రతిభకు ఎవరూ సాటిరారన్నంత గొప్ప పేరు ప్రతిష్టలు ఆయన స్వంతం.