నేడే కొత్త గవర్నర్‌, మంత్రులు ప్రమాణస్వీకారం

తెలంగాణ గవర్నర్‌గా తమిళసై సౌందరరాజన్‌ ఈరోజు ఉదయం బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరవుతారు. అనంతరం గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ వారితో పరిచయాలు చేసుకుంటారు. 

ఇక ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ కూడా నేడే జరుగబోతోంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీష్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతీ రాథోడ్‌లకు మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది. మంత్రిపదవుల కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొని ఉన్నందున మంత్రివర్గంలో నుంచి ఇద్దరు మంత్రులను తొలగించి మరో ఇద్దరు కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ భావించినా దాని వలన పార్టీలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంటుంది కనుక పాతవారిని యదాతధంగా కొనసాగిస్తూ కొత్తగా ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే మంత్రిపదవులకు చాలా మంది పోటీ పడుతున్నందున, ఆశావాహుల నుంచి సిఎం కేసీఆర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. కనుక చివరి నిమిషంలో ఏవైనా మార్పులు చేర్పులు జరిగినా ఆశ్చర్యం లేదు.  

కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తరువాత ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌, మంత్రుల ప్రమాణస్వీకారాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.