
చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విఫలమవడంపై ఒక్క పాక్ తప్ప దేశవిదేశాల నేతలు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. భారత్‌కు మిత్రదేశాలలో ఒకటైన భూటాన్ కూడా దీనిని అపజయంగా భావించడం లేదని తెలిపింది. ఆ దేశ ప్రధాని లొటయ్ త్సెరింగ్ మీడియాతో మాట్లాడుతూ, “చంద్రయాన్-2 చివరి దశలో విఫలం అయినంత మాత్రన్న మొత్తం మిషన్ అంతా విఫలం అయినట్లు మేము భావించడం లేదు. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి తమ మేధస్సుతో ఈ మహాద్భుత కార్యక్రమంలో 98 శాతం విజయవంతంగా పూర్తి చేశారని మేము భావిస్తున్నాము. చంద్రయాన్-2 ప్రయోగంలో ఎన్ని సవాళ్ళు సమస్యలు ఎదురైనా వాటినన్నిటినీ వారు చాలా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగారు. అందుకు వారిని అభినందిస్తున్నాను. త్వరలోనే ఇస్రో శాస్త్రవేత్తలు మరో గొప్ప విజయం సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను,” అని అన్నారు.
దీనిపై ఒక తెలుగువ్యక్తి చాలా హృద్యంగా స్పందించారు. ఆయన మాటలలోనే....
చంద్రుడు ఉపరితల భాగానికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరం వరకు సిగ్నల్ అంది ఆ తర్వాత సిగ్నల్స్ అందకుండా పోయాయి. లైవ్ చూస్తున్న మనకి ఇంత ఇబ్బంది ఉంటే ఎన్నో రోజులుగా మేధోమధనం చేసి ఇంత గొప్ప ప్రయోగానికి శ్రీకారం చుట్టిన మన ఇస్రో శాస్త్రవేత్తలు ఎంత ఇబ్బందిపడి ఉంటారో?ఇస్రో చైర్మన్ గారి ముఖం చూస్తే తెలుస్తుంది వారు ఎంతగా మదనపడుతున్నారో ? ఈ సమయంలో పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థికి ప్రధానోపాధ్యాయుడు ధైర్యాన్ని చెప్పినట్టు మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ఎంతో ధైర్యాన్ని శాస్త్రవేత్తలకు ఇచ్చారు. నిజంగా మన భారత ప్రధాని గారు చెప్పినట్లు ఇది అపజయం కాదు...చంద్రుడికి ఇంత దగ్గరగా కేవలం వెయ్యి కోట్ల ఖర్చుతో అదీ..ఇంతవరకు ఏ దేశం కూడా అడుగుపెట్టని చంద్రుని దక్షిణ దృవంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు మనం చేసిన ప్రయత్నంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో సిగ్నల్ కోల్పోపోవడం జరిగింది. ఈ సమయంలో మన దేశ శాస్త్రవేత్తలుకి వందనాలు తెలుపుతూ భవిష్యత్తులో కచ్చితంగా మనదేశం సాఫ్ట్ ల్యాండింగ్ సాధించాలని ఈ దేశ పౌరులుగా మనం మన శాస్త్రవేత్తలకు అండగా నిలిచి వారి కృషిని వేనోళ్ళ పొగడుతూ వారికి ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాలని మన దేశ పౌరులైన ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను..
జై భారత్
జై ఇస్రో
జై చంద్రయాన్ 2