తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం జీరో: కేటీఆర్‌

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఎటువంటి సహాయసహకారాలు అందజేయడం లేదని, కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు కూడా సహకరించడం లేదని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. 

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ బోర్డు సభ్యులతో బుదవారం తెలంగాణ భవన్‌లో సమావేశమైన కేటీఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాజధానిలో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌లో స్కైవే నిర్మిద్దామనుకుంది. అందుకోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీని, రక్షణమంత్రిని కలిసి అభ్యర్ధించినా స్పందనలేదు. రక్షణశాఖ అధీనంలో నడుస్తున్న కంటోన్మెంటులోని ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే దానిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని కోరినా కేంద్రప్రభుత్వం స్పందించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలనే విజ్ఞప్తిని కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వం చాలా సహకరిస్తోందని రాష్ట్ర బిజెపి నేతలు గొప్పలు చెప్పుకొంటారు. త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో కంటోన్మెంట్ పరిధిలో కూడా తెరాస ఘనవిజయం సాధించడం ఖాయం. తెరాస గెలుపు కేంద్రానికి కనువిప్పు కలిగిస్తుందని భావిస్తున్నాను,” అని అన్నారు.