న్యాయవాదులు విధుల బహిష్కరణ

హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ సుప్రీంకోర్టు కొలీజియమ్ పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో న్యాయవాదులు బుదవారం విధుల బహిష్కరించి నిరసన తెలియజేయడంతో రాష్ట్రంలో నిన్న జిల్లాస్థాయి నుంచి హైకోర్టు వరకు అన్ని కోర్టులలో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. నిన్న ఉదయం హైకోర్టు కోర్టు పని మొదలుపెట్టగానే జస్టిస్ సంజయ్ కుమార్‌ను బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని కోర్టులలో ఇదే పరిస్థితి కనిపించింది. 

జస్టిస్ సంజయ్ కుమార్‌ను రాష్ట్రంలోనే వేరే కోర్టుకు బదిలీ చేయాలి తప్ప వేరే రాష్ట్రానికి బదిలీ చేయరాదని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం త్వరలోనే డిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్‌ని కలిసి జస్టిస్ సంజయ్ కుమార్‌ బదిలీని రద్దు చేయాలని కోరుతామని సంఘం అధ్యక్షుడు సూర్యకిరణ్ రెడ్డి చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ని కలిసి జస్టిస్ సంజయ్ కుమార్‌ బదిలీని నిలిపివేయమని కోరుతామని సూర్యకిరణ్ రెడ్డి చెప్పారు. 

జస్టిస్ సంజయ్ కుమార్‌ బదిలీకి నిరసనగా ఏపీలో న్యాయవాదులు కూడా గురు, శుక్రవారాలు విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. 

న్యాయమూర్తుల బదిలీ సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఆవిధంగానే జస్టిస్ సంజయ్ కుమార్‌ పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేసింది. అందుకు రాష్ట్రంలో న్యాయవాదులు ఎందుకు అభ్యంతరం చెపుతున్నారో తెలియదు కానీ ఇది న్యాయవ్యవస్థ అంతర్గత పాలానా వ్యవహారాలలో కలుగజేసుకోవడమే అవుతుంది. ఒక రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తిని అదే రాష్ట్రంలోనే పనిచేయనీయాలనే డిమాండ్స్ మొదలైతే ఇక వరుసగా ఒకరి తరువాత మరొకరి కోసం న్యాయవాదులు పోరాటాలు చేస్తూనే ఉండాలి.