ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్రం జలక్

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్రం చిన్న జలక్ ఇచ్చింది. ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మద్య సఖ్యత కుదరడంతో పరస్పరం సహకరించుకుంటున్న సంగతి తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తనకు నచ్చిన ఐఏఎస్, ఐ‌పి‌ఎస్ అధికారులను నియమించుకొన్నారు. తెలంగాణలో ఐ‌పి‌ఎస్ అధికారిగా చేస్తున్న స్టీఫెన్ రవీంద్ర కూడా వారిలో ఒకరు. ఆయనను ఏపీకి బదిలీ చేయాలని జగన్ అభ్యర్ధనకు సిఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. దాంతో రెండు ప్రభుత్వాలు ఆయన బదిలీకి అనుమతించాలని కోరుతూ యూపీఎస్సీకి లేఖలు కూడా వ్రాశాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల ఆమోదం లభించినందున స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ప్రభుత్వం నుంచి శలవు తీసుకొని గత మూడు నెలలుగా అనధికారికంగా ఏపీలో ఇంటలిజన్స్‌ ఛీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అధికారికంగా ఫైళ్ళపై సంతకాలు చేయడం లేదు కానీ ఆయన కనుసన్నలలోనే ఏపీ ఇంటలిజెన్స్ విభాగం పనిచేస్తోందిప్పుడు. 

రెండు ప్రభుత్వాల సమ్మతితోనే ఇది జరిగింది కనుక ఆయన బదిలీకి కేంద్రానికి అభ్యంతరం ఉండబోదని, ఆయన బదిలీని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ కావడం లాంఛనప్రాయమేనని భావిస్తుంటే, బదిలీకు వీలులేదని కేంద్రప్రభుత్వం సందేశం పంపించింది. దీంతో స్టీఫెన్ రవీంద్ర మళ్ళీ తెలంగాణకు వెనక్కు తిరిగిరాక తప్పదు. ఆయనతో పాటు ఏపీకి వెళ్లాలని భావించిన ఇతర అధికారులు కూడా ఇప్పుడు వెనక్కు తగ్గక తప్పదు. స్టీఫెన్ రవీంద్రను ఏపీకి పంపించకుండా ముందుగా కేంద్రం అనుమతికి దరఖాస్తు చేసుకొని ఉండి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో?